
- పిల్లలు, గర్భిణులకు సరైన పోషణ అందించాలి
- పోషణ మాసం కార్యక్రమాన్ని సక్సెస్చేయాలి
నస్పూర్, వెలుగు: సరైన పోషణతో ఆరోగ్యవంతమైన రాష్ట్రాన్ని నిర్మిద్దామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి కిషన్, పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అక్టోబర్ 16 వరకు జిల్లాలో నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సక్సెస్ చేయాలని సూచించారు.
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతిరోజు నిర్వహిస్తున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలన్నారు. స్కూళ్ల విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పోషకాహారలోపం ఉన్నవారిని గుర్తించి వారిని సాధారణ స్థితికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భిణుల వివరాలు నమోదు చేసుకుని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పోషణ మాసం వాల్పోస్టర్లను ఆవిష్కరించి పోషణ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఉప వైద్యాధికారి సుధాకర్, సీడీపీవో విజయ, రజిత, పోషణ్ అభియాన్ జిల్లా సమన్వయకర్త సౌజన్య, జిల్లా ప్రాజెక్టు సహాయకులు తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చు
రక్తదానం చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడవచ్చాని కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులోని పద్మనాయక కల్యాణ మండపంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో సొసైటీ జిల్లా ఛైర్మన్ భాస్కర్ రెడ్డి, సభ్యులతో కలిసి కలెక్టర్ల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా గర్భిణులకు ప్రసవ సమయంలో, రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి, అత్యవసర పరిస్థితుల్లో, సికిల్సెల్ తలసేమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని తెలిపారు. రక్తదాతలను అభినందించి ధ్రువపత్రాలు అందజేశారు. సంబంధిత అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.