- నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులుసిబ్బందికి సూచనలు
నస్పూర్/చెన్నూరు/నిర్మల్/భైంసా/ఆదిలాబాద్/ఖానాపూర్/ కాగజ్నగర్, వెలుగు:మున్సిపల్ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని మంచిర్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.అన్వేశ్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తో, చెన్నూరు మున్సిపల్ పరిధిలోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సీఐ బన్సీలాల్తో బుధవారం సందర్శించారు. నామినేషన్ల ప్రక్రియ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థంవంతంగా నిర్వహించినట్లుగానే మున్సిపల్ ఎలక్షన్లను కూడా జాగ్రత్తగా చేపట్టాలన్నారు. అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోగా స్వీకరించాలన్నారు. చివరి తేదీ 31న నామినేషన్లు పరిశీలించి అర్హత గల అభ్యర్థుల జాబితా ప్రకటన, ఫిబ్రవరి 1న నామినేషన్లపై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 2న అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారం, 3న ఉపసంహరణ, అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
పకడ్బందీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా సాగాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ కార్యాలయాలు, భైంసాలోని మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ, నామినేషన్ దాఖలు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందజేయాలన్నారు. లోటుపాట్లు లేకుండా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఆర్డీవో రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఖానాపూర్లోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి అనుచరులు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, తహసీల్దార్ సుజాత రెడ్డి, ఎంపీడీవో రమాకాంత్, సీఐ అజయ్ కుమార్, ఎస్సై రాహుల్ గైక్వాడ్ తదితరులు ఉన్నారు.
ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని ఆసిఫాబాద్ఎస్పీ నితికా పంత్ అన్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీలో నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, చెక్ పోస్టులను ఆమె తనిఖీ చేశారు. నామినేషన్ సెంటర్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది చెక్ పోస్ట్ డ్యూటీలో అలర్ట్గా ఉండాలని, తనిఖీలు ముమ్మరంగా చేయాలని ఆదేశించారు. అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. ఆమె వెంట స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్, టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్
ఆదిలాబాద్ పట్టణంలోని టీటీడీసీలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం వద్ద పకడ్బందీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
