స్టూడెంట్లపై డ్రగ్స్ ప్రభావాన్ని నియంత్రించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

స్టూడెంట్లపై డ్రగ్స్ ప్రభావాన్ని నియంత్రించాలి :  కలెక్టర్ కుమార్ దీపక్
  • అధికారులకు కలెక్టర్ కుమార్ దీపక్ దిశానిర్దేశం 

నస్పూర్, వెలుగు: విద్యార్థులు, యువత భవిష్యత్​పై డ్రగ్స్ ప్రభావాన్ని నియంత్రించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. డ్రగ్స్​నియంత్రణపై సోమవారం కలెక్టరేట్ లో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు, జిల్లా ఆబ్కారీ మద్యనిషేధ శాఖ అధికారి నందగోపాల్, మానసిక వైద్య నిపుణులతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు.

 కలెక్టర్ మాట్లాడుతూ..  డ్రగ్స్​ ఉత్పత్తి, రవాణా, విక్రయం, వినియోగాలను నిరోధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి వినియోగించడం వల్ల కలిగే నష్టాలను అర్థమయ్యేలా ర్యాలీలు, వ్యాసరచన, క్లబ్ ఏర్పాట్లు, వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని, మానసిక వైద్య నిపుణులచే శిబిరాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్డెన్ సెర్చ్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. 

భవన నిర్మాణ కార్మికుల బీమా పెంపు

భవన, ఇతర నిర్మాణ కార్మికుల బీమానుపెంచినట్లు  కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ లో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్ రావు, సహాయ కార్మిక కమిషనర్ పి.నరసింహస్వామి, అధికారులతో కలిసి బీమా పెంపు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికులకు ప్రమాద బీమా క్రింద లబ్ధి మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. సహజ మరణం కింద లబ్ధి మొత్తాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెంచినట్లు చెప్పారు. అధికారులు మండలాల వారీగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి కార్మికులకు ప్రమాద బీమా ఆవశ్యకతపై వివరిస్తారని పేర్కొన్నారు. 

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి 

జిల్లా కేంద్రంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించి అధికారులకు పలు  సూచనలు చేశారు.