
నస్పూర్, వెలుగు: జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో డీసీపీ ఎ.భాస్కర్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్‌తో కలిసి మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాశ్, రవికుమార్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, అటవీ రేంజ్ అధికారులతో అటవీ భూముల ఆక్రమణలు నిరోధించేందుకు చేపట్టే చర్యలపై రివ్యూ నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామని, అటవీ చట్టాలను ఉల్లంఘించి భూముల ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కాటమయ్య రక్షా కిట్ల ద్వారా ప్రమాదాల నివారణ
గీత కార్మికుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కాటమయ్య రక్షా కిట్ల ద్వారా 80 శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గౌడ కులస్తుల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఈ కిట్లను పంపిణీ చేస్తుందన్నారు.
కిట్లపై శిక్షణ పూర్తి చేసుకొని అర్హత పొందిన 19 మందికి పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం, అబ్కారీ- సీఐ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.