- అక్రమ లే అవుట్లపై కలెక్టర్ సీరియస్
- నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన
- వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆదేశాలు
- కొడిమ్యాల, జగిత్యాల రూరల్ మండలాల్లో 25 ఎకరాలను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని హుకూం
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఎలాంటి పంచాయతీల పర్మిషన్లు, నాలా కన్వర్షన్లు లేకుండానే వెంచర్లు ఏర్పడుతున్నాయి. ఎలాంటి రూల్స్ పాటించకుండా ఇష్టారీతిన అక్రమార్కులు ప్లాట్లు ఏర్పాటు చేసి అమ్ముతున్నారు. వీటిని కొన్న సామాన్యులు మోసపోతున్నారు. అక్రమ వెంచర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు.
ఎలాంటి పర్మిషన్లు లేని వెంచర్లలోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దని జిల్లా రిజిస్ట్రార్, పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కొడిమ్యాల, జగిత్యాల రూరల్ మండలాల్లో అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేసిన సుమారు 25 ఎకరాల భూములను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. ఇకపై నాలా కన్వర్షన్ లేకుండా, గ్రామ పంచాయతీ పర్మిషన్ లేకుండా లే అవుట్లు చెల్లవని హెచ్చరించారు.
బ్లాక్ లిస్ట్‌లోకి అక్రమ లే అవుట్ల జాబితా
జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలోని సర్వే నంబర్ 784, 785లోని రెండెకరాలు, పొలాస గ్రామంలో సర్వే నంబర్ 857లో మూడెకరాలు, తిమ్మాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 515లో 0.22 గుంటలు, కొడిమ్యాల మండలం అప్పారావుపేట గ్రామంలో సర్వే నంబర్ 397/ఈ, 397/ఎఫ్, 450/సీ, 460, 461, 462, 463ల్లో 19.32 ఎకరాలను అక్రమ లే అవుట్లు గుర్తించారు. వీటిని బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రేషన్ శాఖకు ఆదేశాలు ఇస్తూ లెటర్ పంపించారు.
దీంతో ఈ లే అవుట్లలో రిజిస్ట్రేషన్‌లు, తదుపరి లావాదేవీలు తక్షణం నిలిపివేయాలని, వీటిపై ఎంపీడీవోలు, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీలు పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా ఈ బ్లాక్‌లిస్ట్ వెంచర్లలో ఇప్పటికే 120 మందికిపైగా సామాన్యులు భూములు కొన్నారు. కొందరు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మరికొందరు అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. అక్రమ లే అవుట్ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కొనుగోలుదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రూల్స్‌కు విరుద్ధంగా వెంచర్లు
రెవెన్యూ, డీటీసీపీ అనుమతులు లేకుండానే కొందరు రియల్ వ్యాపారులు భూములను లే అవుట్లుగా మార్చుతున్నారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలకు స్థలం కేటాయించకుండానే ఆకర్షణీయ ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారు. రూ. లక్షల విలువ చేసే వ్యవసాయ భూములను రూ.కోట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
