ఆ ఇండ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆ ఇండ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు :  కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  • ప్రారంభం కాని ఇందిరమ్మ ఇండ్లపై కలెక్టర్​ఆరా
  • పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం

ఆసిఫాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్​కలెక్టర్​దీపక్ తివారీ, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాశ్ రావుతో కలిసి మున్సిపల్, గృహ నిర్మాణ, మున్సిపల్ వార్డు అధికారులతో రివ్యూ నిర్వహించారు. 

మున్సిపాలిటీల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అందరు లబ్ధిదారులు ప్రారంభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి 498 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటివరకు 391 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 107 మంది లబ్ధిదారులు పనులు చేపట్టలేదని తెలిపారు. 

ఆసిఫాబాద్ మున్సిపాలిటీకి 458 ఇండ్లు మంజూరు కాగా ఇంకా 150 ఇండ్లను ప్రారంభించలేదనన్నారు. ఇందుకు గల కారణాలు తెలుసుకోవాలని, మహిళా సంఘాల నుంచి రుణ సదుపాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ డీఈ వేణుగోపాల్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్, వార్డు అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలి

ఆసిఫాబాద్ జిల్లా పేరును అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. నవంబర్ 28, 29 తేదీల్లో రంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ప్రాంతంలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలికల ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన ఆసిఫాబాద్ గిరిజన ఆదర్శ బాలికల క్రీడా పాఠశాల విద్యార్థినులను డీటీడీవో రమాదేవి, సహాయ గిరిజన అభివృద్ధి అధికారి శివకృష్ణతో కలిసి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.