- కలెక్టర్ ప్రావీణ్య
సంగారెడ్డి టౌన్, వెలుగు : జిల్లాలో పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుగుణంగా భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో టీజీఐఐసీ, జాతీయ రహదారి-65 విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, నిమ్జ్ కు సంబంధించిన భూమిని ప్రత్యేక ప్రయోజన సంస్థకు అందించే అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు అందించే పరిహారం జాప్యం లేకుండా చూడాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం ఇవ్వడానికి నిధులు కొరత లేదన్నారు.
నిమ్జ్ సంబంధించిన భూసేకరణ అనంతరం సొంత హక్కులు, బాధ్యతలు అధికారికంగా సంస్థకు బదిలీ అయ్యే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. టీజీఐఐసీ, నిమ్జ్ ప్రాజెక్టులకు ఇప్పటివరకు భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీల ప్రకారం పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో నిమ్జ్ ప్రత్యేకాధికారి విశాలాక్షి, సంగారెడ్డి-జహీరాబాద్ ఆర్డీవోలు, టీజీఐఐసీ, నిమ్జ్, జాతీయ రహదారి అథారిటీ అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ కల్పవృక్షం లాంటిది..
సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆయిల్‌పామ్ సాగు కల్పవృక్షం లాంటిదని, ఐదేండ్లు మొక్కలను పెంచితే జీవితాంతం రైతులకు ఆదాయం వస్తుందని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో గోద్రెజ్ ఆగ్రోవెట్‌ఆధ్వర్యంలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖలు సంయుక్తంగా జిల్లాలోని సహకార సంఘాల సీఈవోలు, రైతులకు ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాయని తెలిపారు. ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది 3,750 ఎకరాలు టార్గెట్ పెట్టుకోగా, ఇప్పటివరకు 1400 ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగు చేసినట్లు తెలిపారు.
