- కలెక్టర్ పమేలా సత్పతి
గంగాధర, వెలుగు: కరీంనగర్ జిల్లాలోని ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల పిల్లలను బడిలో చేర్పించాలని, ఇందుకోసం ఎంపిక చేసిన స్కూళ్లలో వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం గంగాధర మండలం గట్టుభూత్కూర్‌లో 42 మంది వలస కార్మికుల పిల్లలను గుర్తించి స్థానిక స్కూల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ వివిధ భాషల్లో పలకరించి చదువు, స్వస్థలం, కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ గతేడాది సుమారు 500 మంది విద్యార్థులను స్కూళ్లలో చేర్చించి చదువు చెప్పించామన్నారు. ఇటుక బట్టీల యజమానులతో మాట్లాడి స్కూల్ వరకు రవాణా సదుపాయం కల్పించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రజిత, ఎంఈవో ప్రభాకర్‌రావు, సెక్టోరియల్ ఆఫీసర్ అశోక్‌రెడ్డి, సీఆర్పీ మధు తదితరులు ఉన్నారు.
ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి
కరీంనగర్ టౌన్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. కలెక్టరేట్ హాల్‌లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు వెంకటేశ్వర్లుతో కలిసి రెండో విడత పోలింగ్ ఆఫీసర్లను, సిబ్బందిని ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించినట్లు వెల్లడించారు. రెండో విడతలో చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య వర్ధంతిని కలెక్టరేట్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
