కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లా సైన్స్ మ్యూజియం పురాతన భవనానికి(ఓల్డ్ హైస్కూల్ బిల్డింగ్) పూర్వ వైభవం తీసుకురావాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బిల్డింగ్ రెనోవేషన్‌తోపాటు విద్యార్థులకు సైన్స్ పరిజ్ఞానం అందించే పరికరాలను ఏర్పాటు చేసే పనులను ఇటీవల చేపట్టారు. ఆ పనులను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక సైన్స్ మ్యూజియం ఇదేనని, మ్యూజియంలోని అన్ని గదులను అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సూచించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, జిల్లాలోని వివిధ స్కూళ్ల విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాల ప్రదర్శన కోసం వేర్వేరుగా గదులను కేటాయించాలన్నారు.
15 రోజుల్లోగా మ్యూజియం ఆధునీకరణ పనులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఈవో మొండయ్య, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ ఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాజ్యాంగ హక్కులను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి
రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతీ ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాజ్యంగం దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌తో కలిసి అధికారులు, సిబ్బంది రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ---ప్రపంచంలో అతిపెద్దదైన మన రాజ్యాంగ పరిరక్షణకు, దేశ అభివృద్ధికి కట్టుబడి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఏవో సుధాకర్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
