కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలోని మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆరోగ్య మహిళ పేరిట నిర్వహిస్తున్న ఉచిత వైద్య పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం కరీంనగర్ టీఎన్జీవో సంఘ భవనంలో ఎన్జీవోల సంఘం, జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య పరీక్షలను ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో శిశుగృహలో పెరుగుతున్న 4నెలల శిశువును పిల్లలు లేని దంపతులకు, బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13ఏండ్ల బాలికను సైతం దత్తత ఇచ్చారు. కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, డీడబ్ల్యూవో సరస్వతి, టీఎన్జీవో జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ రావు, టీజీవో జిల్లా అధ్యక్షుడు చరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
రామడుగు, వెలుగు: నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం రామడుగు మండలం వెదిర జీపీలో వెదిర, వెలిచాల జీపీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటుచేసిన నామినేషన్ల సెంటర్‌ను ఆమె పరిశీలించారు. హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తును పరిశీలించారు.
ఎలాంటి పొరపాటు జరుగకుండా నామినేషన్ల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజేశ్వరి, ప్రత్యేకాధికారి అనిల్ ప్రకాశ్, అధికారులు ఉన్నారు.
