
కరీంనగర్ టౌన్, వెలుగు: పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోషణ మాసోత్సవంలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్‌లోని కోతిరాంపూర్ హైస్కూల్‌లో శుక్రవారం సభ, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ పోషకాహారంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. తక్కువ అన్నం ఎక్కువ కూరలు తీసుకోవాలన్నారు.
లింగ వివక్ష చూపకుండా పిల్లలకు ఇంటి పనులు, వంట పనులతో పాటు ఆరోగ్యకర ఆహారం తయారు చేసే విధానం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా ఐరన్ కాల్షియం, మాత్రలు తీసుకోవాలన్నారు. అంతకుముందు ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా విద్యార్థులు ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన ఆహార పదార్థాల ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘నేను సైతం’ ఎన్జీవో ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందించారు. అనంతరం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
క్లెయిమ్ చేయని బ్యాంకు ఖాతాల సమస్యల పరిష్కారం కోసం ప్రచారం నిర్వహించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించిందని, ఈ మేరకు 10 ఏండ్లు కన్నా బ్యాంకు ఖాతాలో నగదు ఉంచి, మరిచిపోయిన వారు బ్యాంకుకు వచ్చి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇచ్చి ఖాతాను యాక్టివేషన్ చేసుకోవాలని సూచించారు. గూగుల్‌లో ఉద్గం పోర్టల్‌లో రిజిస్టర్ కావాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో వెంకటరమణ, మెప్మా పీడీ స్వరూపరాణి, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్, బ్యాంకర్లు పాల్గొన్నారు.
భూసేకరణ సమస్యలను పరిష్కరించాలి
కరీంనగర్– వరంగల్ హైవే 563 నిర్మాణం కోసం భూసేకరణ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ పీడీ భరద్వాజ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబుతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణకు సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు.