సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం : కలెక్టర్ ప్రావీణ్య

సర్వోన్నతమైనది భారత రాజ్యాంగం : కలెక్టర్ ప్రావీణ్య

సంగారెడ్డి టౌన్, వెలుగు: భారత రాజ్యాంగం అన్ని దేశాల రాజ్యాంగాల కంటే సర్వోన్నతమైనదని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి అంబేద్కర్ ప్రభుత్వ న్యాయ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవానికి న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య, ఎస్పీ పరితోశ్ పంకజ్ లతో కలిసి హాజరయ్యారు. అనంతరం  విద్యార్థులు, అధ్యాపకులు భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ ను చదివారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం భారత రాజ్యాంగం అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు చేసుకొనే వెసులుబాటును రాజ్యాంగ సవరణ చట్టం మనకు కల్పించిందన్నారు. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ విద్యార్థుల పాత్ర ఎనలేనిదన్నారు. న్యాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విలువలతో పనిచేస్తూ గుర్తింపు పొందాలని సూచించారు. కార్యక్రమంలో కాలేజీ అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగ నినాదం సత్యమేవ జయతే..

నారాయణ్ ఖేడ్: భారత రాజ్యాంగ నినాదం సత్యమేవ జయతే అని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖేడ్ లోని సాయిబాబా పంక్షన్ హాల్​లో నిర్వహించిన సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ప్రతిఫలాలు అందరం పొందుతున్నామన్నారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలు ప్రజాస్వామ్యానికి మార్గ నిర్దేశం చేస్తున్నాయన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక మండలి మాజీ సభ్యుడు నగేశ్ షెట్కార్, ప్రజా సంఘాల నాయకులు విశ్వనాథ్, రహీం, గణపతి, జీవన్, తుకారం, సాయిలు, వినోద్​పాటిల్, న్యాయవాది బోజిరెడ్డి, డ్యాని, తాహేర్  పాల్గొన్నారు.

ప్రజలందరూ రాజ్యంగాన్ని గౌరవించాలి

పుల్కల్: దేశ ప్రజలందరూ భారత  రాజ్యంగాన్ని గౌరవించాలని చౌటకూర్​ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఉప్పరి దేవదాస్ అన్నారు. భారత రాజ్యంగా దినోత్సవాన్ని చక్రియాల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ  అంబేద్కర్​ బాటలో నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జీపీ కార్యదర్శి శివకుమార్, ప్రిన్సిపాల్ రవికుమార్, అంబేద్కర్ సంఘం నాయకులు శ్రీనివాస్, ఆనందం పాల్గొన్నారు.