- కలెక్టర్ రాహుల్ రాజ్
కౌడిపల్లి, వెలుగు: రానున్న మూడు రోజులు తుపాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, డీసీఎస్ఓ నిత్యానంద్, సివిల్ సప్లై డీఎం జగదీశ్ తో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుపాను తీవ్రత తగ్గేవరకు కోతలు వాయిదా వేయడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుందన్నారు.
కోయకుండా ఉంటే పంట త్వరగా ఆరడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే రవాణా చేయాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్స్ అందుబాటులో ఉంచాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలో 8,442 టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు.
అవినీతి రహిత పాలన లక్ష్యంగా పనిచేయాలి
మెదక్ టౌన్: జిల్లా వ్యాప్తంగా అవినీతి రహిత పాలన లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సోమవారం నుంచి నవంబరు 2 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా విజిలెన్స్ డీఎస్పీ సతీశ్ రెడ్డి, సీఐలు నాగుల్ మీరా, ప్రశాంత్, హరికృష్ణ, విజిలెన్స్ ఏజీ కోటేశ్వర్ రెడ్డి, విజిలెన్స్ ఏవోతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి నిర్మూలనపై క్విజ్ పోటీలు, వాక్‌ధాన్‌లు, మారథాన్‌లు, వీధి నాటకాలు, గ్రామసభలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం విజిలెన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
త్వరలో ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం
నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ సమీపంలో నిర్మించిన ఎకో పార్క్ కాటేజీలు త్వరలో ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మంగళవారం కలెక్టర్, డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి అర్బన్ పార్క్ కాటేజీల నిర్మాణాలను పరిశీలించారు. నర్సాపూర్ ఏకో పార్క్ యాత్రికుల సౌకర్యార్థం 42 కాటేజీలను అటవీశాఖ ప్రైవేట్ సంస్థలతో కలిసి నిర్మించిందని, త్వరలో టూరిస్టులకు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
