జీపీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

జీపీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
  •     జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్

పాపన్నపేట/టేక్మాల్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం పాపన్నపేట, టేక్మాల్ ఎంపీడీవో ఆఫీసులో నామినేషన్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 27న ఉదయం ఎన్నికల నోటిఫికేషన్, ఓటర్​జాబితా  గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో  ప్రదర్శించనున్నట్టు తెలిపారు. 

నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని ఈనెల 29 వరకు స్వీకరిస్తామని చెప్పారు. 30న పరీశీలన, డిసెంబర్ 1న అప్పీళ్లు, 2న డిస్పోజల్, 3న ఉపసంహరణ ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణకు 147 మంది  రిటర్నింగ్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. ప్రతి రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.  ఒక వ్యక్తి  గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేసేందుకు  అవకాశం ఉంటుందన్నారు. 

ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్ : జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సిద్దిపేట కలెక్టరేట్ లో ఎన్నికల ఏర్పాట్లపై సీపీ విజయ్ కుమార్ తో కలిసి జిల్లా ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3 విడతల్లో మొత్తం 508 జీపీలు, 4508 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు ముగ్గురికే అనుమతి ఉంటుందన్నారు. 

నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరిని అనుమతించవద్దని అధికారులను ఆదేశించారు. సీపీ మాట్లాడుతూ.. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద, బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరేవరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్​అధికారులను ఆదేశించారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో వైన్ షాపులు, బార్లు మూసివేయాలన్నారు.

 అనంతరం కలెక్టరేట్ లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞను చదివించారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్‌డీవో జయదేవ్ ఆర్యా, సీపీఓ నాగేశ్వర్, జడ్పీ సీఈఓ రమేశ్ పాల్గొన్నారు.