
కౌడిపల్లి, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, మైనార్టీ, ట్రైబల్ గురుకులాల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం మండలంలోని తునికి మహాత్మ జ్యోతిబాపూలే, కౌడిపల్లిలోని గిరిజన సంక్షేమ బాలుర పాఠశాల, గిరిజన బాలికల మినీ గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల్లో ఎన్ని క్లాస్ రూమ్స్, ఎన్ని డార్మెటరీలు ఉన్నాయో ప్రభుత్వానికి నివేదిక పంపించాలని సీఎంరేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఇందులో భాగంగానే అన్ని గురుకులాలను అధికారులు తనిఖీ చేస్తూ వాటిలో ఉన్న సదుపాయాలు, లోటుపాట్లు పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు. తనిఖీ అనంతరం సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందించాక వసతులు లేని చోట వసతులు కల్పించి స్టూడెంట్స్‌కు మంచి విద్య అందిస్తారని చెప్పారు. అనంతరం స్టూడెంట్స్‌కు పాఠాలు బోధించి వారితో కలిసి స్నాక్స్తిన్నారు. ప్రిన్సిపాళ్లు హరిబాబు, ఫణి కుమార్, హెచ్ఎం శ్రీ ప్రియ ఉన్నారు.
భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
మెదక్‌టౌన్: జిల్లాలో అటవీ, రెవెన్యూ భూసమస్యలను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శనివారం అడిషనల్ కలెక్టర్నగేశ్, డీఎఫ్‌వో జోజీ, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డితో కలిసి సంబంధిత తహసీల్దార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే జిల్లాలో అటవీ, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సంబంధించి అధికారులు జాయింట్ వెరిఫికేషన్చేసి రిపోర్టు ఇవ్వాలని సూచించారు. మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.