మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపడుతున్నాం : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపడుతున్నాం : కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ రాహుల్​ రాజ్ ​తెలిపారు. గురువారం హవేలీ ఘనపూర్​ మండలం శాలిపేటలో ఫ్యాక్స్​ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని  తహసీల్దార్​ సింధు రేణుకతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటి వరకు 10, 530 టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు

అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. రైతులు తేమ శాతం వచ్చాకే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని కోరారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీ కేంద్రంలో ఫ్లెక్సీపై రాష్ట్ర, జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లు తప్పక ప్రదర్శించాలన్నారు. కలెక్టర్​ వెంట తహసీల్దార్​ సింధు రేణుక, రెవెన్యూ సిబ్బంది, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఉన్నారు. 

మోటార్లను రిపేర్లు చేయించాలి

హవేలీ ఘనపూర్​ మండలం జక్కన్నపేటలో ఇంటర్మీడియట్​ పంప్​ స్టేషన్​లో పని చేయని మోటార్లను కలెక్టర్​పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా మిషన్ భగీరథ నీటిని 35 గ్రామాలకు పంపించాలని అప్పటి వరకు లోకల్ సోర్సెస్ ద్వారా అన్ని గ్రామాల్లో తాగునీరు సరఫరా చేయాలని సూచించారు. శుక్రవారం  మధ్యాహ్నం వరకు నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నిఖిత, బాలకృష్ణ ఉన్నారు.