మెదక్, వెలుగు: రక్తహీనత, పోషణ లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు. పోషణ మాసోత్సవం సందర్భంగా గురువారం మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో పోషన్ అభియాన్ జాతీయ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోని ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధి అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పోషకాహార పదార్థాల, పిల్లల్లో సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందింపజేందుకు చేపడుతున్న కార్యక్రమాలు వివరించే స్టాల్స్‌ను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు, మహిళలు, కిషోర బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ధాలనే లక్ష్యంతో పోషణ మాసం నిర్వహిస్తున్నమన్నారు. బాల్యవివాహాలు జరిగితే పెళ్లి కొడుకును, కుటుంబ సభ్యులను, పెళ్లికి హాజరైన బంధుమిత్రులను, పెళ్లి జరిపించే పంతులు తోపాటు అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
శిశు సంక్షేమ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. కార్యక్రమంలో సంక్షేమ అధికారి హేమాభార్గవి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, అడిషనల్ డీఆర్డీఓ సరస్వతి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎంసీహెచ్ డీఎంఈలు, విజయనిర్మల, జయలక్ష్మి పాల్గొన్నారు.
చెరువులు ఆక్రమణకు గురికాకుండా చూడాలి
రామాయంపేట: చెరువు, కుంటలు, కాల్వలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. రామాయంపేట పట్టణంలోని మల్లె చెరువు, పాండచెరువు , కొత్తచెరువులను పరిశీలించారు. వాటి హద్దులను గూర్చి అడిగి తెలుసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ చెరువులు, కాల్వల సర్వే జరిపి ఎఫ్టీయల్, బఫర్ జోన్ లలో వస్తున్న సర్వే నంబర్లు, సబ్ డివిజన్లలో సహా సర్వే చేసి అందులో అందులో ఎటునంటి శాశ్వత కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రజినీ కుమారి, ఆర్ ఐ గౌస్ ఉన్నారు.
