మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ రాహుల్ రాజ్

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి :  కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు:  మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషిని కొనసాగిస్తోందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రభుత్వం కల్పించిన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సదుపాయాన్ని 200 కోట్ల మంది వినియోగించుకున్న సందర్భంగా బుధవారం మెదక్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో సంబురాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర  ప్రభుత్వం 2023  డిసెంబర్ 9 నుంచి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెస్తూ, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ వసతిని కల్పించిందని గుర్తు చేశారు. 

ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 20 నెలల కాలంలోనే 200 కోట్ల సార్లు మహిళలు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని వివరించారు. తద్వారా ప్రయాణ ఛార్జీల రూపంలో రూ. 6,680 కోట్లు మహిళలకు ఆదా అయ్యాయని అన్నారు. వ్యాస రచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. పలువురు మహిళా ప్రయాణికులను, ఆర్టీసీ సిబ్బందిని సన్మానించారు. ఆర్టీసీ డీఎం సురేఖ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్స్ వీరబాబు , సుగుణాకర్ పాల్గొన్నారు.