రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేయాలి : కలెక్టర్ రాహుల్ శర్మ
  • జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి రూరల్, వెలుగు : వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్నరోడ్లను తక్షణమే రిపేర్​ చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ ఆఫీస్ లో మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, మున్సిపల్ ఆఫీసర్లతో  వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలపై  సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు విభాగాలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చోట్ల సహాయ చర్యలకు సంబంధించిన ప్రజోజల్స్ ఇవ్వాలని సూచించారు. 

డీఎంఎఫ్టీ నిధులు సక్రమంగా ఉపయోగించాలి..

జిల్లా ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం జిల్లా మినరల్ డెవలప్మెంట్(డీఎంఎఫ్టీ) నిధులు సమర్థవంతంగా వినియోగించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం ఐడీవోసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో పలు శాఖల జిల్లా స్థాయి అధికారులతో ప్రణాళికశాఖ ఆధ్వర్యంలో డీఎంఎఫ్టీ మేనేజింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రంగాలకు డీఎంఎఫ్టీ నిధులు సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఆయా సమావేశాల్లో అడిషనల్ కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ శ్వేత, పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, డీఎఫ్ వో నవీన్ రెడ్డి, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, సీపీవో బాబూరావు, వివిధ శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.