
భూపాలపల్లి రూరల్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం భూపాలపల్లి మండలంలోని ఎస్.ఎన్.కొత్తపల్లిలో నిర్మాణంలోని ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులు జంగా రాణి, నాలుక రామ్మూర్తి, తరగంప కరుణలతతో మాట్లాడి, ఇంటి పనులు ఎప్పుడు ప్రారంభించారు, సామగ్రికి సంబంధించి ఏమైనా సమస్యలున్నాయా అని తెలుసుకున్నారు. కాల్వపల్లి ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తెచ్చుకోవాలని చెప్పారు.
దశల వారీగా జరుగుతున్న పనుల ఫొటోలు, వివరాలను వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్లోడ్చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ తీరును పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేశారు. పలువురు విద్యార్థులతో పాఠాలు చదివించారు. పిల్లలకు చదువుపై ఆసక్తి పెరిగేలా పాఠాలు బోధించాలని టీచర్లకు సూచించారు.
విద్యార్థుల నమోదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. డీఈవో రాజేందర్, ఎంపీడీవో నాగరాజు, గృహ నిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, ఏఈ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.