
మెదక్ టౌన్, వెలుగు : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితాలో ఉన్న డబుల్ఓట్లను తొలగించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. శనివారం మెదక్ పట్టణంలోని ఫారెస్టు ఆఫీసులో, కొల్చారం మండలం అప్పాజిపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బీఎల్వోల వద్ద ఉన్న ఓటరు జాబితా లిస్టులు పరిశీలించారు. పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత, కొత్తగా ఓటరు నమోదుకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి తదతర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యేక ఓటరు నమోదు గురించి గ్రామాల్లో చాటింపు వేసి ప్రచారం చేయాలన్నారు.
ఫొటో, డబుల్ ఎంట్రీ ఇతర పొరపాట్లు లేకుండా సరిచేయాలని సూచించారు. ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అన్ని పోలింగ్ బూత్‌ల్లో కొనసాగుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మెదక్, నర్సాపూర్ ఆర్డీవోలు అంబదాస్, రాజేశ్వర్, శ్రీనివాసులు, తహసీల్దార్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, ఎంపీడీవో గణేశ్ రెడ్డి, బీఎల్వోలు శిరీష, ఇందిర పాల్గొన్నారు.
సీఎంఆర్ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు
జిల్లాలో సీఎంఆర్ పెండింగ్ ఉన్న రైసుమిల్లుల యజమానులతో కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు బియ్యం ఇవ్వని మిల్లుల యజమానులపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిర, చర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే ధాన్యాన్ని కొనుగోలు చేసి నిర్ణీత గడువులోపు లక్ష్యానికి అనుగుణంగా సీఎంఆర్ డెలివరీ చేయాలని మిల్లర్లకు తేల్చిచెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో బాయిల్డ్ రైస్ నిల్వలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు నెలకొని ఉంటే జిల్లా యంత్రాంగం తరపున తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్జిల్లా మేనేజర్ హరికృష్ణ, డీసీఎస్వో బ్రహ్మారావు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.