నాగోబా జాతరను విజయవంతం చేద్దాం : కలెక్టర్ రాజర్షి షా

నాగోబా జాతరను విజయవంతం చేద్దాం : కలెక్టర్ రాజర్షి షా
  •  కలెక్టర్ రాజర్షి షా

ఇంద్రవెల్లి, వెలుగు: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి నాగోబా జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దర్బార్ హాల్​లో జాతర ఏర్పాట్లపై మంగళవారం ఎమ్మెల్యే బొజ్జ పటేల్, అధికారులతో కలిసి​రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న పనులను గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజలకు వివరించాలన్నారు.

 దర్బార్ కు మంత్రులు 

నాగోబా జాతర దర్బార్​కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ రానున్నట్లు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ కరెంటు సమస్యలు తలెత్తుకుండా చూసుకోవాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, ఏఎస్పీ కాజల్ సింగ్, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ముఖాడే ఉత్తం, సర్పంచ్ మెస్రం తుకారాం, వివిధ శాఖల అధికారులు, మెస్రం పెద్దలు పాల్గొన్నారు.

రికార్డులు లేని గ్రామాలకు టెక్నాలజీతో పరిష్కారం

ఆదిలాబాద్, వెలుగు: జిల్లాలో రికార్డులు లేని 8 గ్రామాలకు అత్యాధునిక టెక్నాలజీతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలం చిచ్దరి ఖానాపూర్ గ్రామ పంచాయతీలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 

జిల్లాలోని 8 గ్రామాలకు సంబంధించి సరైన కాడాస్ట్రల్ మ్యాపులు, టిప్పన్లు, రికార్డులు అందుబాటులో లేవని, వాటిని అత్యాధునిక '‘రోవర్’ మిషన్ల ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో కచ్చితమైన సర్వే సాధ్యమవుతుందన్నారు. ఈ సర్వే ద్వారా మొదట గ్రామ సరిహద్దులు, ఆ తర్వాత రైతుల వారీగా (పట్టాదారు/కాస్తుదారు) భూముల సరిహద్దులను నిర్ణయించి మ్యాపులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

గ్రామస్తులు ప్రస్తావించిన 60 ఎకరాల భూ సమస్యను సర్వే పూర్తయిన వెంటనే తహసీల్దార్ టైటిల్స్ పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్కూల్​కు ప్రహరీ, ఉపాధి హామీ పథకం కింద చిన్న చెక్ డ్యామ్‌లను మంజూరు చేస్తామన్నారు. ఇంద్రవెల్లి మార్కెట్‌కు వెళ్లే రోడ్డు, విద్యుత్ స్తంభాల సమస్యలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు.