
- సర్కార్ నుంచి జీవో వచ్చే వరకు గోప్యం
- ఆశావహుల్లో మొదలైన టెన్షన్
- 42 శాతం రిజర్వేషన్లతో బీసీల్లో జోరు
ఆదిలాబాద్, వెలుగు: స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఆదిలాబాద్ జిల్లాలో పరిషత్ సమావేశ మందిరంలో గత రెండు రోజుల పాటు చేపట్టిన ప్రక్రియ పూర్తయ్యింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనాభా ప్రాతిపాదికన, రొటేషన్ విధానంలో రిజర్వేషన్లు కల్పించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచే మండలాలు, గ్రామాల వారీగా జనాభా వివరాలను జిల్లాకు పంపించగా.. దాని ప్రకారమే రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టారు. కలెక్టర్ రాజర్షి షా ఆధ్వర్యంలో జడ్పీ సీఈవో, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో దగ్గరుండి పర్యవేక్షించారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి కులాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి నివేదిక సిద్ధం చేశారు. అయితే ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవో జారీ కాకపోవడంతో అధికారులు రిజర్వేషన్ల వివరాలు వెల్లడించలేదు. దీంతో ఏ స్థానాన్ని ఎవరికి కేటాయించారోనని ఉత్కంఠ నెలకొంది.
గోప్యంగా ప్రక్రియ
స్థానిక సంస్థల ఎన్నికల కోసం అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది, ఓటర్ లిస్టు తయారు చేసిన యంత్రాంగం.. తాజాగా రిజర్వేషన్ల ప్రక్రియ సైతం పూర్తిచేసింది. రెండ్రోజుల పాటు కసరత్తు చేసిన అధికారులు ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అయితే ఏయే స్థానానికి ఏయే కేటగిరి కల్పించారో అనే వివరాలు మాత్రం గోప్యంగా ఉంచారు. ప్రభుత్వం నుంచి జీవో జారీ అయ్యేవరకు బయటపెట్టకూడదనే ఆదేశాలు ఉండటంతో వెల్లడించడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 20 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లెక్కన 8 స్థానాలు రిజర్వ్ అవుతున్నాయి. ఎస్టీలకు 8, ఎస్సీలకు 2, జనరల్ కు 2 స్థానాలు కేటాయించారు. జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాలకు సైతం రిజర్వేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఇక ఎలక్షన్ షెడ్యూల్ విడుదలవడమే తరువాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ల లెక్కలు తేల్చాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆశావహుల్లో ఆందోళన
స్థానిక రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. అయితే రిజర్వ్ స్థానాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో జనరల్ సీట్లపై ఆశపడ్డ నాయకులకు షాక్ తగిలింది. ప్రభుత్వం ముందుగా చెబుతున్నట్లుగానే బీసీ రిజర్వేషన్లు పెంచడంతో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు కేటాయించారు. దీంతో బీసీల్లో పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు స్థానాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో ఆ వర్గం నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉండడంతో అటు రాజకీయ పార్టీలు సైతం ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. నిత్యం పార్టీల్లో చేరికల జోరు కొనసాగుతోంది.
ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల వివరాలు
సర్పంచ్ స్థానాలు 473
వార్డులు సభ్యులు 3,870
ఎంపీటీసీ స్థానాలు 166
ఎంపీపీ స్థానాలు 20
జడ్పీటీసీ స్థానాలు 20