పత్తి రైతులకు ‘కపాస్కిసాన్’ యాప్ తో మేలు : కలెక్టర్ రాజర్షి షా

పత్తి రైతులకు ‘కపాస్కిసాన్’ యాప్ తో మేలు : కలెక్టర్ రాజర్షి షా
  • క్వింటాలుకు రూ.7521 మద్దతు ధరతో కొనుగోలు: కలెక్టర్

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: పత్తి రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మొబైల్​లో ‘కపాస్​కిసాన్’ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలని ఆదిలాబాద్​ కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియ నేపథ్యంలో  బుధవారం కలెక్టరేట్​లో ఎస్పీ అఖిల్​మహాజన్​తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు. పత్తి కొనుగోళ్లకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పత్తి రైతులు కనీస మద్దతు ధరకు సీసీఐకి పంటను అమ్ముకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘కపాస్​కిసాన్’ మొబైల్​యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. రైతులు పత్తిని ఎంఎస్పీ కింద విక్రయించాలంటే ఈ యాప్ ద్వారా ముందుగా నమోదు చేసుకోవాలన్నారు. 

రైతుల నమోదు, పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్, ధరల సమాచారం, సమీప సీసీఐ కొనుగోలు కేంద్రాల వివరాలు తదితర సమాచారం యాప్​లో ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో11 సీసీఐ, 36 జిన్నింగ్ కేంద్రాల్లో రోజుకు సగటున 10,490 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. క్వింటాలుకు రూ.7521 కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ సలోని, డీఎస్పీ జీవన్ రెడ్డి, మార్కెటింగ్ అధికారి గజనంద్ తదితరులు పాల్గొన్నారు.