
మెదక్ టౌన్, వెలుగు: తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆదివారం యువతకి సీ-విజిల్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎవరైనా నగదు, మద్యం, పంపిణీ చేస్తే ఫొటోలు, వీడియోలను తీసి సీ– విజిల్ యాప్ ద్వారా పంపాలన్నారు. దీనిపై 100 నిమిషాల్లో అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. లైవ్ ఫొటోలు, వీడియోలు తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జీపీఎస్ ఆన్‌లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిక్‌గా లోకేషన్ నమోదు అవుతుందని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్నెంబర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ సిబ్బంది కేటాయింపు
మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది కేటాయింపు ర్యాండమైజేషన్ ప్రక్రియ ద్వారా చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ఈ నెల 30, 31వ తేదీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, నర్సాపూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లలో మాస్టర్ ట్రైనర్లతో ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.