కొత్త ప్రొసీడింగ్స్​ ఇవ్వడానికి వీలులేదు

కొత్త ప్రొసీడింగ్స్​ ఇవ్వడానికి వీలులేదు
  • మెదక్​ కలెక్టర్​ రాజర్షిషా

మెదక్​, వెలుగు : ఎలక్షన్​ కోడ్​ అమల్లోకి వచ్చినందున గృహలక్ష్మి, తదితర పథకాలకు సంబంధించి కొత్త ప్రొసీడింగ్స్​ ఇవ్వడానికి వీల్లేదని కలెక్టర్​ రాజర్షిషా తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్​ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్​లతో కలిసి మీడియాతో మాట్లాడారు. చీరల పంపిణీ, చెక్కుల పంపిణీ ఆఫీసర్ల ద్వారా జరగాలి తప్ప, ప్రజాప్రతినిధులు పంపిణీ చేయొద్దన్నారు. గవర్నమెంట్ అమలు చేసే స్కీంలకు సంబంధించిన బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు.  ఎక్కడైనా బిల్డింగ్​ ఓనర్​ అనుమతి ఇస్తే బ్యానర్​, పోస్టర్​ పెట్టుకోవచ్చని ఆ ఖర్చు సంబంధిత అభ్యర్థి ఎన్నికల ఖర్చు కిందకు వస్తుందన్నారు.

పబ్లిషర్స్​, ప్రింటర్స్​ ఎలక్షన్​కు సంబంధించి పార్టీల పాంప్లెంట్స్​, పోస్టర్స్​, ప్లకార్డులు ప్రింట్​ చేస్తే కచ్చితంగా వాటిమీద ప్రింటర్​ పేరు, అడ్రస్​ ఉండాలని స్పష్టం చేశారు. లేనట్టయితే సెక్షన్​ 127 ఏ ప్రకారం శిక్ష, జరిమానా పడుతుందని హెచ్చరించారు. ఫాం-6 ద్వారా కొత్త ఓటర్ల నమోదు, ఫాం-8 ద్వారా అడ్రస్​ మార్పునకు నామినేషన్​ చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందన్నారు.

నాలుగు ఫ్లయింగ్​ స్వ్కాడ్​ టీంలు, రెండు విజిలెన్స్​సర్వలెన్స్​ టీంలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కంట్రోల్​ రూమ్​, సీ - విజిల్​ కంట్రోల్​ రూమ్​, మీడియా కంట్రోల్​ రూమ్​, వెబ్​ కాస్టింగ్​ కంట్రోల్​ రూమ్​లు ఏర్పాటు చేస్తామన్నారు. 

ఐదు చెక్​ పోస్టులు

ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్​ పోస్ట్​లు ఏర్పాటు చేస్తున్నట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. 161 నేషనల్ హైవే,  పెద్దశంకరంపేట టోల్​ గేట్,​ 44 నేషనల్ హైవే,  తూప్రాన్​ టోల్​ గేట్​ వద్ద, రామాయంపేట వద్ద, 765 - డి నేషనల్ హైవే మీద,  నర్సాపూర్​ ఎక్స్​ రోడ్​ వద్ద, ఎల్లారెడ్డి రూట్లో పోచమ్మరాల్​ వద్ద చెక్​ పోస్టులు ఉంటాయన్నారు.

ఆయా చెక్​ పోస్ట్​ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. వెహికిల్​ చెకింగ్​ నిర్వహించి నిబంధనలకు మించి డబ్బు, మద్యం, తదితర వస్తువులు తరలిస్తే పట్టుకుని కేసు నమోదు చేస్తామనితెలిపారు.