ఎలక్షన్​ సామగ్రి కోసం కాలేజీ బిల్డింగ్​ల పరిశీలన : రాజీవ్ గాంధీ హన్మంతు

ఎలక్షన్​ సామగ్రి కోసం కాలేజీ బిల్డింగ్​ల పరిశీలన : రాజీవ్ గాంధీ హన్మంతు

నిజామాబాద్, వెలుగు:   ఎలక్షన్​ సామగ్రి డిస్ర్టిబ్యూషన్​ పాయింట్,  స్ర్టాంగ్​రూమ్​, ఓట్ల లెక్కింపు కోసం గవర్నమెంట్ పాలిటెక్నిక్​, సీఎస్ఐ కాలేజీలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మంగళవారం పరిశీలించారు. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల కోసం అనువైన భవనాలు, గదులను పరిశీలించారు. గదుల లీకేజీలు క్షుణ్ణంగా పరిశీలించాలని  ఆర్అండ్​బీ ఇంజినీర్లను ఆదేశించారు. 

సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్  యాదిరెడ్డి,  డీసీపీ జయరాం, అగ్నిమాపక శాఖ అధికారి మురళీ మనోహర్,  ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులతో కౌంటింగ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సంబంధించిన విషయాలు చర్చించారు.  ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రిటర్నింగ్​ ఆఫీసర్లను ఆదేశించారు.  మంగళవారం నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక సూచనలు చేశారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, సెక్టోరల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, కౌంటింగ్ సూపర్ వైజర్లు, అబ్జర్వర్ల నియామకాల కోసం సరిపడా సిబ్బందిని గుర్తించి రాండ మైజేషన్ ద్వారా నియమించాలన్నారు.  కనీసం 20 శాతం సిబ్బందిని రిజర్వులో పెట్టుకోవాలన్నారు.  

పోలింగ్, కౌంటింగ్ విధులకు వేర్వేరుగా సిబ్బందిని నియమించి  విధుల పట్ల వారికి పూర్తి అవగాహన కల్పించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. సరిపడా వాహనాలను అందుబాటులో పెట్టుకోవాలని,  పోలింగ్ సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్​ ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, క్షేత్రస్థాయిలో విచారించి నివేదికలు సమర్పించాలన్నారు.  ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మద్యం, నగదు నిల్వలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో టాయిలెట్స్, ర్యాంపులు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించాలన్నారు. అంతకు ముందు ఆయన పొలిటికల్​ పార్టీల లీడర్లతో మీటింగ్​ నిర్వహించి కోడ్​పై అవగాహన కల్పించారు.