మున్సిపల్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

మున్సిపల్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు : మున్సిపల్​ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని జనగామ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరెట్ లో మైక్రో అబ్సర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి జనరల్ అబ్జర్వర్ నర్సింహా రెడ్డి, అడిషనల్ కలెక్టర్ పింకేశ్​కుమార్ తో కలిసి హాజరై పలు సూచనలు చేశారు. పోలింగ్ బూత్‌‌లో జరిగే మొత్తం ప్రక్రియను మైక్రో అబ్జర్వర్ నిశితంగా పరిశీలించాలన్నారు.

పోలింగ్ స్టేషన్ వెలుపల, లోపల చేపట్టే ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలింగ్ స్టేషన్ పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో ప్రచార నిషేధం వంటి అంశాలపై మైక్రో ఆబ్జర్వర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. జనరల్ అబ్సర్వర్ నర్సింహా రెడ్డి మాట్లాడుతూ పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమన్నారు.

మైక్రో అబ్జర్వర్లకు అవసరమైన శిక్షణ, అవగాహనను మాస్టర్ ట్రైనర్ మెరుగు బాలరాజు అందించారు. కాగా, ఎన్నికల సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు పోస్టల్​ బ్యాలెట్​ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక పోస్టల్​ బ్యాలెట్​ సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ తెలిపారు. జనగామ, స్టేషన్​ ఘన్​పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

అంతకుముందు కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని, వారితో కలిసి కాసేపు పోటీల్లో పాల్గొని ఉత్సాహపరిచారు.