ఆన్​లైన్​ ద్వారా ఈవీఎంలను కేటాయించాం : రిజ్వాన్​ బాషా షేక్​

ఆన్​లైన్​ ద్వారా ఈవీఎంలను కేటాయించాం : రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ, వెలుగు : పోలింగ్​ కేంద్రాలకు ఆన్​లైన్​ ద్వారా ఈవీఎంలను కేటాయించామని, పొలిటికల్ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిదశ ఈవీఎం, వీవీ ప్యాట్ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​కుమార్, రోహిత్ సింగ్, ఆర్డీవోలు కొమురయ్య, వెంకన్నతో కలిసి ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ  నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో జనగామ, స్టేషన్​ఘన్​పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు 869 పోలింగ్ కేంద్రాలకు ఆన్ లైన్ ద్వారా ఈవీఎంలను కేటాయించామన్నారు. కార్యక్రమంలో పార్టీల ప్రతినిధులు చెంచారపు శ్రీనివాస్​రెడ్డి, రావెల రవి, ఏగుర్ల విజయభాస్కర్, విజయేందర్, జోగు ప్రకాశ్, తేజావత్ అజయ్ కుమార్, మడిపడిగ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎసెన్షియల్​ఉద్యోగులకు పోస్టల్​బ్యాలెట్​అందించేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈవీఎం అవగాహన ఉండాలి

ములుగు, వెలుగు : పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఎలక్ర్టానిక్​ ఓటింగ్​ యంత్రాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అధికారులకు పోలింగ్ విధులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అడిషనల్​ కలెక్టర్లు పి.శ్రీజ, సీహెచ్ మహేందర్ జీతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజు 450మంది హాజరు కావాల్సి ఉండగా, 437 మంది హాజరు అయ్యారని, మిగలిన 13 మంది గురువారం శిక్షణా కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ జి.పాణిని, తహసీల్దార్లు విజయ భాస్కర్, రవీందర్, ట్రైనింగ్ నోడల్ అధికారి జయదేవ్, జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.

ర్యాండమైజేషన్ పూర్తి..

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటి దశ ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ములుగు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 303 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, మన జిల్లాలో 378 బ్యాలెట్ యూనిట్లు, 378కంట్రోల్ యూనిట్లు, 424 వీవీప్యాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు.