మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలి : కలెక్టర్ సంతోష్

మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలి :  కలెక్టర్ సంతోష్

మంచిర్యాల, వెలుగు: జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయంతో పాటు ఎరువుల కృత్రిమ కొరతను అరికట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం, ఎరువుల కృత్రిమ కొరత, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తరలింపు అంశాలపై జిల్లా వ్యవసాయ అధికారి సురేఖతో కలిసి మండల వ్యవసాయ అధికారులతో కలెక్టరేట్ లో మంగళవారం రివ్యూ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వరిధాన్యం తరలించకుండా చర్యలు తీసుకోవాలని, అంతర్రాష్ట్ర చెక్​పోస్ట్​ల వద్ద, నదీ మార్గాన తరలింపు జరుగకుండా ముమ్మర తనిఖీలు చేపట్టాలన్నారు.

 జిల్లాలో సాగుకు అవసరమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, 292 షాపుల ద్వారా అమ్ముతున్నట్లు చెప్పారు. ప్రతి షాపులో స్టాక్, ధరల పట్టిక ప్రదర్శించాలని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఫర్టిలైజర్ షాపులకు అనుమతుల మంజూరులో రూల్స్ పాటించాలని, ఎరువుల  కృత్రిమ కొరత సృష్టించకుండా స్టాక్ వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక దిగుబడి సాధించేందుకు రైతులకు సాగు మెళకువలను అందించాలన్నారు.

నకిలి విత్తనాలపై అవగాహన

దండేపల్లి: విత్తనాల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దండేపల్లి మండల వ్యవసాయ అధికారి గొర్ల అంజిత్ కుమార్ రైతులకు అవగాహన కల్పించారు. మండలంలోని నంబాలలో మంగళవారం రైతులతో సమావేశం నిర్వహించి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. విత్తనాలు కొన్న దుకాణం నుంచి కచ్చితంగా రసీదు తీసుకోవాలని, ఆ బిల్లును పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ లూజ్​విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అర్చన తదితరులు పాల్గొన్నారు.