
గద్వాల, వెలుగు: ర్యాలంపాడు ఆర్ఆర్ సెంటర్లో పెండింగ్ పనులను కంప్లీట్ చేయాలని కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ధరూర్ మండలం ర్యాలంపాడు ఆర్ఆర్ సెంటర్ లో కల్పించే సౌలతులపై గ్రామస్తులు, ఆఫీసర్లతో కలిసి రివ్యూ చేశారు. ర్యాలంపాడు గ్రామస్తులు భూములు ఇవ్వడంతో జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.
సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం పూర్తి బాధ్యతతో పునరావాస కేంద్రంలో అన్ని సౌలతులు కల్పిస్తుందని చెప్పారు. 67.28 ఎకరాల భూమిలో 823 ప్లాట్లను ఏర్పాటు చేశామని, ఇప్పటికే 695 ప్లాట్లను నిర్వాసితులకు మంజూరు చేశామని తెలిపారు. ఇండ్ల స్థలాల కోసం మరోసారి భూసేకరణ చేస్తామన్నారు. 250 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీవో అలివేలు, తహసీల్దార్ నరేందర్, నీటిపారుదల శాఖ ఈఈ శ్రీనివాసులు ఉన్నారు.
అర్థమయ్యేలా చదువు చెప్పాలి..
గద్వాల టౌన్: స్టూడెంట్లకు అర్థమయ్యేలా చదువు చెప్పి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. గద్వాల పట్టణంలోని బురదపేట హైస్కూల్‌ను తనిఖీ చేశారు. టెన్త్ స్టూడెంట్లతో పాఠాలు చదివించారు. ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకునేలా పేరెంట్స్ కు అవగాహన కల్పించాలన్నారు.