
కంది, వెలుగు: సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ, ఆర్ అండ్‌బీ పంచాయతీరాజ్, టీఎస్ఎంఐసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు, వైద్య ఆరోగ్య, పంచాయతీ శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలపై సమీక్షించాలన్నారు. మహాప్రస్థానం, వైకుంఠధామం పనులు జనవరి 15 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్డీఎఫ్ తో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించి త్వరగా కంప్లీట్ చేయాలని చెప్పారు. వర్క్ వైజ్‌గా ఎప్పటి వరకు పూర్తవుతాయో యాక్షన్ ప్లాన్ ఇవ్వాలన్నారు.
మిషన్ భగీరథ ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ప్రారంభానికి ఏర్పాటు చేయాలని ఎస్ఈకి సూచించారు. ఏఎన్ఎం భవనాలు, ఎంసీహెచ్, డయాలసిస్ సెంటర్లకు సంబంధించి ఇంజినీరింగ్ ఆఫీసర్లతో కోఆర్డినేషన్‌తో పూర్తి చేయాలన్నారు. క్రీడా ప్రాంగణాలను అన్ని హంగులతో అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటిపారుదల పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ రాజర్జి షా, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రీ దేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి, డీఈవో, నీటిపారుదల శాఖ ఎస్ఈ మురళీధర్, మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
‘మన ఊరు.. మన బడి’ పనులు స్పీడప్ చేయలి
సంగారెడ్డి టౌన్, వెలుగు : మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో విద్యాశాఖ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో అడిషనల్ కలెక్టర్ రాజర్జి షాతో కలిసి సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని సూచించారు. పనులు పూర్తయిన వెంటనే ఇంజినీరింగ్ అధికారులు బిల్లులను ఎఫ్టీవోలో నమోదు చేయాలని చెప్పారు.
‘దళిత బంధు’తో అభివృద్ధి చెందాలి
సంగారెడ్డి జిల్లాలో దళితబంధు లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయూత నివ్వాలని కలెక్టర్ డాక్టర్ శరత్ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో దళితబంధు లబ్ధిదారుల యూనిట్ల అభివృద్ధిపై ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు దళితబంధు పొందకముందు, పొందిన తర్వాత వారి స్థితిగతులను ప్రతేకాధికారులు పర్యవేక్షించి, వారికి కావాల్సిన సపోర్ట్ అందించాలని సూచించారు.