వెలుగు, నెట్ వర్క్: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, కలెక్టర్లు, అబ్జర్వర్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల్లో సౌలతులపై ఆరా తీశారు.
నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీ ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ప్రీ స్క్రూటినీ, హెల్ప్ డెస్క్ ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థుల అనుమానాలు నివృత్తి చేయాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో సౌలతులు, భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని సౌలతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయంతో కలిసి ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, జోనల్ అధికారులు, నోడల్ అధికారులకు శిక్షణ తరగతులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
మున్సిపాలిటీల్లో స్వీకరించిన నామినేషన్ల వివరాలను టీ పోల్ యాప్‌లో నమోదు చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూల్స్ ప్రకారం వ్యవహరించాలని, హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు పూర్తి సహకారం అందించాలన్నారు.
గద్వాల, అయిజ మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. భద్రత ఏర్పాట్లను డీఎస్పీ మొగిలయ్యను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ శాంతియుతంగా, సజావుగా జరిగేలా చూడాలని సూచించారు.
వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. నోడల్ అధికారులు జిల్లాలో మున్సిపల్ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను అమలు చేయడంలో రాజీ పడవద్దని సూచించారు. నోడల్ అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యాలయాల్లో రాజకీయ చిహ్నాలు, పోస్టర్లు తొలగించాలని సూచించారు.
ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో వనపర్తి మున్సిపాలిటీ ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను అబ్జర్వర్ జి.లక్ష్మీబాయి, కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. మెటీరియల్ పంపిణీ, కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని అబ్జర్వర్ కాత్యాయనీ దేవి కోరారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్ లో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన మీటింగ్‌కు కలెక్టర్ విజయేందిరబోయి, ఎస్పీ జానకితో కలిసి హాజరయ్యారు. ఎన్నికల సంఘం రూల్స్‌ను తప్పకుండా పాటించాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు.
