
కమలాపూర్, వెలుగు: కమ్యూనిటీ, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో మెరుగైన వైద్య సేవలందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. కమలాపూర్ మండల కేంద్రంలోని హెల్త్ సెంటర్లను కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపీ, ఐపీ, ల్యాబ్, ఫార్మసీ, ఎక్స్ రే యూనిట్లు, పేషెంట్లకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. కమలాపూర్ ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న ప్రసూతి సేవల వివరాలపై ఆరా తీశారు.
పేషెంట్స్ తో మాట్లాడి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఇద్దరు డయేరియాతో అడ్మిట్ కాగా, వారికి అందుతున్న తాగునీటిని పరిశీలించాలని ఎంపీడీవోని ఆదేశించారు. అనంతరం స్థానిక ఎంజేపీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, ఆహార పదార్థాలను అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డీసీహెచ్ఎస్ గౌతమ్ చౌహాన్, డీఎంహెచ్వో అప్పయ్య, డీఈవో వాసంతి, వరంగల్ ఆర్సీవో రాజ్ కుమార్ తదితరులున్నారు.