ఈ సారు ట్యాలెంటే వేరు.. ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్..

ఈ సారు ట్యాలెంటే వేరు.. ఫేషియల్ రికగ్నిషన్ యాప్లో  సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్..

ఒక ప్రభుత్వ ఉద్యోగి టెక్నాలజీని వినియోగించడంతో తనకు తానే సాటి అని నిరూపించాడు. ఆన్ లైన్ అటెండెన్స్ వేసుకోవడంలో ప్రభుత్వం తెచ్చిన యాప్ ను ఈ సారు వినియోగించుకోవడం చూసి పై అధికారులే షాక్ అయ్యారు. ఇంత ట్యాలెంట్ ఉన్న ఉద్యోగిని విధుల్లో నుంచి సస్పెండ్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్.

వివరాల్లోకి వెళ్లే.. జగిత్యాల బుగ్గారం మండలంలోని చందయాపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రాజన్నను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో రేవంత్ రెడ్డి ఫోటోతో అటెండెన్స్ వేసుకుంటున్నట్లు గుర్తించారు. విధులకు హాజరు కాకుండా యాప్‌లో సీఎం  ఫోటో అప్లోడ్ చేస్తూ హాజరు వేసుకోవడం అధికారులను ఆగ్రహానికి గురి చేసింది. 

పంచాయతీ కార్యదర్శుల హాజరును పర్యవేక్షించేందుకు ఇటీవలే మొబైల్ ఫోన్ యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా విధులు నిర్వహిస్తున్న గ్రామాల నుండే అటెండెన్స్ నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కొందరు  రోజూ ఒకే ఫోటో పెట్టడంతో అనుమానం వచ్చి అధికారులు తనిఖీలు చేపట్టారు. 

ఈ తనిఖీల్లో జగిత్యాల జిల్లాలో విధులకు హాజరు కాకుండా ఫేషియల్ రికగ్నిషన్ యాప్‌లో సీఎ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్న ఒక పంచాయతీ కార్యదర్శి నిర్వాకం చూసి అధికారులు షాకయ్యారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో సదరు కార్యదర్శిని విదుల్లోనుంచి తప్పించారు. అదే విధంగా కొందరు విధులకు వెళ్లకుండా ఇతరుల సహాయంతో తాము లేకుండానే అటెండెన్స్ నమోదు చేసుకుంటున్నారని.. ఖాళీ కుర్చీల ఫోటోలు పెట్టి అటెండెన్స్ వేసుకుంటున్న పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.