
మంచిర్యాల,వెలుగు: రైస్ మిల్లర్లు నాణ్యత పేరుతో ధాన్యం కటింగ్ పెడితే చర్యలు తప్పవని కలెక్టర్ భారతి హోళికేరి హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్‌తో కలిసి సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లతో మంగళవారం కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ధాన్యంలో తరుగు తీయడం, అన్‌లోడింగ్‌లో ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మాయిశ్చర్, క్లీనింగ్, తూకం ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మిల్లర్లకు కేటాయించిన లక్ష్యాలను జనవరి 15లోగా పూర్తి చేయాలన్నారు. ఒక్కో ధాన్యం బస్తా 40 కిలోల సంచికి 600 గ్రాములు తూకం వేయాలన్నారు. జిల్లాలో 229 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 581 మంది రైతుల నుంచి 4,336 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 2,946 టన్నులు మిల్లులకు తరలించడం జరిగిందని తెలిపారు. 42 మంది రైతుల వివరాలు ట్యాబ్ ఎంట్రీ చేసి రూ.61 లక్షలు మాత్రమే వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. రైతుల కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే 6303928682 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. డీసీఎస్వో ప్రేమ్‌కుమార్, మార్కెటింగ్ ఆఫీసర్ గజానంద్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్మాస్ కాంతయ్య పాల్గొన్నారు.
బొగ్గు బ్లాక్‌ల వేలంతో సింగరేణికి నష్టం
మందమర్రి,వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బ్లాక్‌ల వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తూ సింగరేణి సంస్థకు నష్టం చేస్తున్నాయని ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్ప్రసాద్పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసిపేట-2 గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. పర్మినెంట్ఎంప్లాయీస్ లేకుండా కాంట్రాక్టీకరణ, ఔట్సోర్సింగ్విధానాలను అమలు చేయడం దారుణమన్నారు. వచ్చే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ అనైతికపొత్తుకు సిద్ధమవుతున్నాయని, కార్మికులు అప్రమత్తంగా ఉండి బుద్ధి చెప్పాలన్నారు. సమావేశంలో సెంట్రల్సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిద్దంశెట్టి రాజమౌళి, జనరల్ సెక్రటరీ కాంపెల్లి సమ్మయ్య, ఏరియా వైస్ ప్రెసిడెంట్దేవీ భూమయ్య, సెంట్రల్ చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
కుమ్రంభీం స్ఫూర్తితో ముందుకెళ్లాలి
కాగజ్ నగర్,వెలుగు: ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రంభీం పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లాలని భీం మనుమడు కుమ్రం సోనేరావు కోరారు. నైజాం విముక్త స్వాతంత్ర అమృత్సవాల్లో భాగంగా మంగళవారం కాగజ్ నగర్ వినయ్ గార్డెన్ లో జిల్లా యువ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్యవక్త శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మల్‌లోని వెయ్యి ఉరుల మర్రి, బైరాన్‌పల్లి పోరాటం చరిత్రలో నిలిచిపోయాయన్నారు. కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ కిషన్ రావు, నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి టాకిరి జైపాల్, కార్యదర్శి నైతం శంకర్, సభ్యులు నైతం శీతల్, ఉత్సవ సమితి కాగజ్ నగర్ మండల ఉపాధ్యక్షుడు అల్లంకి శివ కుమార్, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు శ్రీమాధవరం రంగస్వామి, పోతురాజుల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని గ్రామాలకు భగీరథ నీరందాలి
బెల్లంపల్లి రూరల్,వెలుగు: అన్ని గ్రామాలకు మిషన్‌భగీరథ నీరందాలని బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. మంగళవారం కాసిపేటలోని మిషన్‌భగీరథ ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిర్ల క్ష్యం కారణంగా తాగునీరు అందడంలేదన్నారు. స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మంచినీటి కోసం గోపడుతున్నారన్నారు. నిరసనలో పార్టీ మండల ఇన్చార్జి అట్కాపురం రమేశ్, మండల ప్రధాన కార్యదర్శి సూరం సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు బాకి నరేశ్, రాజు, బక్కోళ్ల రమేశ్ పాల్గొన్నారు.
11వ వేజ్‌బోర్డు అమలు చేయాలె
మందమర్రి/నస్పూర్,వెలుగు: బొగ్గుగని కార్మికులకు 11వ వేజ్‌బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో బొగ్గు గనులపై నిరసన వ్యక్తం చేశారు. మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియాలోని అండర్ గ్రౌండ్ మైన్లు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై యూనియన్ లీడర్లు, కార్మికులు నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. బుధవారం కలకత్తాలో జరిగే 11వ వేజ్‌బోర్డు చర్చల్లో మెరుగైన వేతన ఒప్పందం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యం వేతన ఒప్పందంపై నిర్లక్ష్యం చేస్తున్నాయని, జాతీయ సంఘాలు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన నిరసనల్లో టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్సురేందర్రెడ్డి, లీడర్లు మంద మాల్లారెడ్డి, అన్నయ్య, రవిందర్‌రెడ్డి, మందమర్రి ఏరియా ఆర్కే1ఎ గనిపై కంబగోని సుదర్శన్‌గౌడ్, హెచ్. రవిందర్, కె.సత్యనారాయణరెడ్డి, బండారి భిక్షపతి, శివ పాల్గొన్నారు.
ఎస్టీ హాస్టల్ ను సందర్శించిన బీజేపీ లీడర్లు
జైపూర్ (భీమారం), వెలుగు: భీమారం ఎస్టీ హాస్టల్ ను మంగళవారం జిల్లా ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పత్తి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్
సందర్శించారు. స్టూడెంట్లతో మాట్లాడి పరిస్థితి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ భరత్ రెడ్డి, కిసాన్ మోర్చా ప్రెసిడెంట్సల్ల రాజిరెడ్డి, లీడర్లు అవిడపు సురేశ్, గుడిమల్ల బాపు, యూత్ ప్రెసిడెంట్ రాజేశ్ తదితరులు ఉన్నారు.
తూతూ మంత్రంగా మున్సిపల్ మీటింగ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం తూతూమత్రంగా జరిగింది. మున్సిపల్‌చైర్మన్ పెంట రాజయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన మీటింగ్‌లో అజెండా అంశాలపై ఎలాంటి చర్చ లేకుండానే కేవలం అరగంటలోనే ముగిసింది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఉప్పలయ్య మాట్లాడుతూ తన వార్డులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు కిందటి మీటింగ్ చైర్మన్ హామీ ఇచ్చారని, ఆ అంశాలను అజెండాలో ఎందుకు పొందుపర్చలేదని ప్రశ్నించారు. దీనికి నిరసనగా ఆయన మీటింగ్‌ను బాయ్కట్చేసి వెళ్లిపోయారు. అజెండా అంశాలను చదివి వినిపించిన తర్వాత చైర్మన్ పెంట రాజయ్య మీటింగ్ ముగించి వెళ్లిపోయారు. అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఈ సందర్భంగా కాంగ్రెస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మీడియాతో మాట్లాడారు. పట్టణ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, కుక్కలు, పందుల బెడద ఎక్కువైందని, మంచినీళ్లు వారానికోసారి వస్తున్నాయని అన్నారు. ప్రజల సమస్యలపై చర్చించకుండానే సమావేశాన్ని ముగించడంపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు.