నిజామాబాద్, వెలుగు: లోపాలులేని ఓటర్లిస్ట్ రూపకల్పనలో భాగంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కోసం పొలిటికల్ పార్టీలన్నీ బూత్ లెవల్ఏజెంట్లను వెంటనే నియమించుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ఇలా త్రిపాఠి కోరారు. ముసాయిదా ఓటర్ లిస్టు ప్రకటించినప్పుడు తప్పులుంటే సరిచేయడానికి వారి అవసరం చాలా ఉంటుందన్నారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్లో ఈఆర్వో, ఏఈఆర్వోలతో రివ్యూ నిర్వహించి మాట్లాడారు. బీఎల్ఏల అపాయింట్మెంట్లు పూర్తిచేసి నిర్దేశిత ఫార్మాట్లో తమకు వివరాలు అందజేస్తే వారికి శిక్షణ ఇవ్వడానికి వీలుంటుందని తెలిపారు.
మృతి చెందిన ఓటర్లు, వలసవెళ్లిన ఓటర్లను కచ్చితంగా గుర్తించేలా శిక్షణ ఇవ్వాలన్నారు. పోలింగ్ బూత్ల వారీగా వీఐపీ ఓటర్లను మాత్రం ఈఆర్వోలు స్వయంగా పరిశీలించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, విజయ, రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
