- కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
- రూ.లక్ష రుణ చెక్కు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాపీ అందజేత
ఆసిఫాబాద్, వెలుగు: గత నెల 18న దహెగాం మండలంలోని గెర్రె గ్రామంలో హత్యకు గురైన శ్రావణి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే భరోసా ఇచ్చారు. గురువారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తో కలిసి మృతురాలి తండ్రి చెన్నయ్యకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాపీ, ఇంటి నిర్మాణానికి మహిళా సమాఖ్య నుంచి రూ.లక్ష రుణ చెక్కు అందించారు.
3 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అట్రాసిటీ కేసు కింద బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తున్నామని చెప్పారు. మొదటి విడతగా రూ.4,12,500 మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చామన్నారు.
శ్రావణి తల్లిదండ్రులకు ఉపాధి నిమిత్తం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏదైనా దుకాణం పెట్టుకునేందుకు, ఆమె తమ్ముడిని గురుకుల పాఠశాలలో చేర్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. శ్రావణిని హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఉజ్వల పథకంపై అవగాహన కల్పించాలి
ప్రధానమంత్రి ఉజ్వల పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, రవాణా, వ్యవసాయ, మత్స్య శాఖల అధికారులు, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం కింద కేంద్రం పేదవారికి ఉచితంగా ఎల్పీ జీ సిలిండర్లు ఇస్తుందని, అర్హులను గుర్తించాలని సూచించారు.
