ఆసిఫాబాద్, వెలుగు: న్యూస్ పేపర్లలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. న్యూస్పేపర్లలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం నుంచి వచ్చే రిజైండర్లకు తీసుకున్న చర్యలపై ప్రతిరోజూ సాయంత్రం 3 గంటల్లోగా జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. రిజైండర్లపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీపీఆర్ఓ సంపత్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలోనూ రాణించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి షూటింగ్ బాల్ క్రీడా పోటీల్లో ఆసిఫాబాద్ జిల్లా జట్టు గోల్డ్మెడల్ సాధించిన సందర్భంగా సోమవారం కలెక్టరేట్ లో క్రీడాకారులను అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని క్రీడాకారులు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో రాణిస్తున్నారని హర్షం
వ్యక్తం చేశారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం
భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. కార్మిక బీమా పెంపు, కార్మికుల సంక్షేమంపై కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో కలెక్టరేట్లో రివ్యూ నిర్వహించారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు, ఇతర కార్మికుల సంక్షేమం కొరకు అనేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అవగాహన కార్యక్రమ పోస్టర్లను రిలీజ్ చేశారు.
