కాగజ్ నగర్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. కాగజ్ నగర్ మండలంలోని బోరిగాం శివారులో నిర్మించిన ఇండ్లను శుక్రవారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తో కలిసి పరిశీలించారు. కిటికీలు, తలుపుల బిగింపు, విద్యుత్ సరఫరా, అంతర్గత రహదారులు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం తదితర పనులు త్వరగా పూర్తి చేసి, ఇండ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
ఆర్ అండ్ బీ, హౌసింగ్, విద్యుత్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని చెప్పారు. ఇండ్ల మధ్య ముళ్ల పొదలను తొలగించాలని, పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శేషారావు, గృహ నిర్మాణ శాఖ డీఈఈ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు
ఆసిఫాబాద్, వెలుగు: జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ప్రారంభించారు. ఈ నెల 19 వరకు పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, వక్తృత్వ పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన, ధ్యానం, పాటలు, రంగోలి, మెహందీ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సక్సెస్ చేయాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, లైబ్రేరియన్లు, పాఠకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్వో ప్లాంట్ ప్రారంభం
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు, వారి కుటుంబసభ్యులకు శుద్ధమైన తాగునీరందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. దవాఖానలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
