వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే చెప్పారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, డీఆర్​డీఏ సురేందర్, ఏడీఏ శ్రీనివాస్ రావు, పౌరసరఫరాల శాఖ అధికారులు తారామణి, నర్సింగరావుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో పౌరసరఫరాల శాఖ, ఐకేపీ ఆధ్వర్యంలో 37 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, అవసరమైన టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ, వ్యవసాయ విస్తరణ అధికారులతో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, తూకం జరిగిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. 

కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలి

నిర్మల్: యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్​లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 203 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఏప్రిల్ తొలి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వీటి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వరి ధాన్యం అక్రమ రవాణా జరగకుండా స్వర్ణ, బెల్ తరోడ, బిద్రెల్లిలో అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని వివరించారు.

అనంతరం ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. పనిచేయని చేతి పంపులు, బోర్వెల్స్ లను వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, డీపీఓ శ్రీనివాస్, అర్ డబ్ల్యూఎస్ డీఈ సందీప్,  జిల్లా పౌరసరరాలశాఖ అధికారి నందిత, డీఎం శ్రీకళ ఇతర అధికారులుపాల్గొన్నారు.