ఆసిఫాబాద్, వెలుగు: మహిళల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో డీఆర్డీవో దత్తరావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందిస్తామని, లక్షా 11 వేల చీరలు పంపిణీకి సిద్ధం చేసినట్లు తెలిపారు. రెండు రోజుల్లో చీరల పంపిణీ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, వడ్డీ లేని రుణాలు లాంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళా శక్తి చీరల పంపిణీ జన్నారం రూరల్, వెలుగు: జన్నారం మండలంలోని తొర్రే గ్రామపంచాయతీలో మంగళవారం ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి రమేశ్, సీసీ సునీత, కాంగ్రెస్ నేతలు మండాడి ననేశ్వర్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.
