నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు

నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు
  •    గ్రామాల్లో పర్యటించిన కలెక్టర్లు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్, వెలుగు : జిల్లాలో నీటి ఎద్దడి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆసిఫాబాద్​ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం వాంకిడి మండలం ఎలోని కొలంగూడ గ్రామంలో తాగునీటి సౌకర్యాలను అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, తహసీల్దార్ రోహిత్ దేశ్ పాండేతో కలిసి పరిశీలించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీటి సమస్యను రెండ్రోజుల్లో పరిష్కరించి మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పైపులైన్ల లీకేజీలను గుర్తించి త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలన్నారు. చేతి పంపులు, నల్లా కనెక్షన్ల ద్వారా నీటి సరఫరాకు అవకాశం లేని ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో రిజిస్టర్లు, విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. టీచర్లు వివిధ బోధనా పద్ధతులను అవలంభించి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేలా, వారికి అర్థమయ్యేలా బోధించాలన్నారు.ఈసందర్భంగా గ్రామస్తులు కలెక్టర్​కు ఘనస్వాగతం పలికారు.

నీటి సమస్య రాకుండా చూస్తున్నాం

వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. తలమడుగు గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పంచాయతీరాజ్, ఆర్​డబ్ల్యూఎస్ మున్సిపాలిటీ అధికారులు ప్రతి హాబిటేషన్​లో నీటి సమస్యలు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. సుంకిడిలో సంప్ హౌస్ నిర్మాణం జరుగుతోందని, పూర్తయిన తర్వాత భీంపూర్, తలమడుగు

తాంసి గ్రామాలకు పంపింగ్ చేపడతామన్నారు. లక్ష్మీపూర్​లో ఏర్పాటు చేసిన ఇంటర్ స్టేట్ బోర్డ్ చెక్​పోస్ట్​లను పరిశీలించారు. జిల్లాలో 6 ఇంటర్ స్టేట్ చెక్​పోస్ట్ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతరం తలమడుగులోని జడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలోని 53 కేంద్రాల్లో టెన్త్ ​ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు.