మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

ఆర్మూర్, వెలుగు:  మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్​ లో సంబురాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5.54 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసి రూ. 230 కోట్లు ఆదా చేసుకున్నారని అన్నారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో నిజామాబాద్ రీజియన్ పరిధిలో కొత్తగా 141 బస్సులను కొనుగోలు చేశారని తెలిపారు. వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్, ఆర్డీవో రాజాగౌడ్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిపో మేనేజర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

స్కూళ్లలో మెనూ అమలు కావాల్సిందే.. 

బాల్కొండ, వెలుగు: గవర్నమెంట్ స్కూళ్లు, వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో మెనూ అమలు కావాల్సిందేనని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లను   తనిఖీ చేశారు. అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేయించాలని ఏఈని ఆదేశించారు. ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  కలెక్టర్​తనిఖీ చేసి హాజరు రిజిస్ట్రర్​ను పరిశీలించారు. సీజనల్​వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సొసైటీ ఎరువుల గిడ్డంగిని సందర్శించి ఎరువుల నిల్వ రికార్డులను పరిశీలించారు. జిల్లాలో కావాల్సిన యూరియా, ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. కలెక్టర్​వెంట మండల ప్రత్యేక అధికారి శివరామకృష్ణ, వైద్య సిబ్బంది ఉన్నారు. 

స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా 

నిజామాబాద్, వెలుగు : జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లపై పకడ్బందీగా నిఘా పెట్టాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. రూల్స్ అతిక్రమించే సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏ టెస్ట్​కు ఎంత తీసుకుంటున్నారో స్కానింగ్ సెంటర్లలో బోర్డులు ఏర్పాటు చేయించాలని డీఎంహెచ్​వో డాక్టర్ రాజశ్రీకి సూచించారు. లింగ నిర్థారణ పరీక్షలు చేసే సెంటర్లను సీజ్​ చేసి, జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

అదే సమయంలో బేటీ బచావో, బేటీ పడావోపై స్కూల్స్​, కాలేజీలు, పీహెచ్​సీల్లో ఆశలు, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్​ అంకిత్​, ఐఎంఏ ప్రతినిధి శ్రీనివాస్​, లీగల్ సెల్​ ప్రతినిధి రవిప్రసాద్​ తదితరులు పాల్గొన్నారు. తరువాత జిల్లాలోని ప్రైమరీ హెల్త్​ సెంటర్ల డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి మాట్లాడారు. సీజనల్ వ్యాధుల పట్ల అలర్ట్​గా ఉండాలన్నారు. మెడికల్ శాఖ అదనపు డైరెక్టర్ అమర్​సింగ్​, డిప్యూటీ డీఎంహెచ్​వో డాక్టర్ తుకారం రాథోడ్, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్​ డాక్టర్ అశోక్ ఉన్నారు.