నిజామాబాద్, వెలుగు : సర్కార్ బడులన్నింటిలో మౌలిక వసతులు ఉండేలా ఎంఈవోలు ఫోకస్ పెట్టాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన మండలాల వారీగా విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. టాయిలెట్స్, కరెంట్, తాగునీటి సౌకర్యం లేని స్కూల్స్ ఉండడానికి వీలులేదన్నారు. ఇచ్చిన నిధులు అన్నిచోట్ల ఖర్చు చేస్తూ పనులు షురూ చేయాలన్నారు.
స్టూడెంట్స్ ఫేషియల్ అటెండెన్స్ వంద శాతం జరగాలని, యూడైస్ పోర్టల్‌లో ఆధార్ వివరాలు ఎన్రోల్ చేయాలన్నారు. అపార్ జనరేట్ చేయని స్కూల్స్‌కు నోటీసులు అందిస్తామన్నారు. మెనూ ప్రకారం స్టూడెంట్స్‌కు భోజనాలు పెట్టాలని, హెల్త్ చెక్అప్ రెగ్యూలర్‌గా చేయించాలన్నారు. భవిత సెంటర్స్, వయోజన విద్యపై రివ్యూ నిర్వహించారు. అడిషనల్కలెక్టర్ అంకిత్, డీఐఈవో రవికుమార్, డీఈవో అశోక్, ఎంఈవోలు ఉన్నారు.
వెటర్నరీ సేవలు పెంచాలె..
పాడి రైతులకు వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. పశుసంవర్థక శాఖ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. సీజన్ వారీగా పశువులకు సోకే వ్యాధులను గుర్తించి ట్రీట్మెంట్ అందించాలని, వాక్సినేషన్ చేయాలన్నారు. పశువైద్య వాహనం వద్దే చికిత్సలు జరిగేలా చూడాలని, డాక్టర్ల కొరత ఉన్న చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వెటర్నరీ శాఖ జేడీ డాక్టర్ రోహిత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
