- కలెక్టర్ రాహుల్ రాజ్
టేక్మాల్, వెలుగు: పత్తి రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ రైతు వేదికలో మంగళవారం పెద్దశంకరంపేట డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 21,193 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేశారని తెలిపారు. వ్యవసాయ అధికారులు ప్రతీ గ్రామంలో కపాస్ కిసాన్ యాప్ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రైతులు ఎవరూ కూడా దళారులకి పత్తి అమ్మి మోసపోవద్దని, యాప్ లో స్లాట్ బుక్ చేసుకొని జిన్నింగ్ మిల్లులో అమ్మి మద్దతు ధర పొందాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలను మానిటరింగ్ చేసేందుకు లోకల్ కమిటీలను నియమించి రైతులు మద్దతు ధర పొందెలా కృషి చేయాలన్నారు.
లీగల్ మెట్రాలాజీ అధికారులు తేమ కొలిచే యంత్రాలను పరిశీలించాలని సీసీఐ అధికారుల పర్యవేక్షణ ఉండాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా జిన్నింగ్ మిల్లు యాజమాన్యం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ జాతీయ ఆహార భద్రత పథకం కింద రైతులకు జొన్న విత్తనాలను రాయితీపై అందించారు. కార్యక్రమంలో డీఏవో దేవ్ కుమార్, ఇన్చార్జి ఏడీఏ రాంప్రసాద్, ఆయా మండలాల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
రైతులు, మిల్లర్లకు సహకరిస్తాం: కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్ : పత్తి కొనుగోలులో రైతులు, మిల్లర్లకు సహకరిస్తామని కలెక్టర్హైమావతి చెప్పారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మిల్లర్లు ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్ 4 ఎంపిక విధానం వల్ల జిల్లా పరిధిలో మొత్తం 22 జిన్నింగ్ మిల్లులకు గాను 10 మిల్లులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. క్షేత్రస్థాయిలో రైతు సమస్యల పరిష్కారానికి అధికారులతో పాటు మిల్లర్లు సహకరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, మార్కెటింగ్ డీఎం నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్శంకర్ నారాయణ పాల్గొన్నారు.
సర్వే అధికారుల పాత్ర కీలకం
భూ భారతి అప్లికేషన్ల డిస్పోజల్ లో సర్వే అధికారుల పాత్ర కీలకం అని కలెక్టర్ హైమావతి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ లో జిల్లా, మండల సర్వే ల్యాండ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ నెల మండల సర్వేయర్లు ఆయా తహసీల్దార్లకు టూర్ డైరీ లు సమర్పించాలని, గతంలోని జిల్లాకు సంబంధించిన సర్వే రికార్డులన్నీ సేకరించి భద్రపరచుకోవాలనీ సర్వేల్యాండ్ ఏడీ వినయ్ కుమార్ ను ఆదేశించారు. సర్వేయర్లు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీవారం సమీక్ష నిర్వహిస్తామని సర్వే శాఖలో పెండింగ్ అప్లికేషన్లు డిసెంబర్ లోపు డిస్పోజల్ చెయ్యాలని ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
- హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్హైమావతి అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్-, కొత్తపల్లి రహదారి నిర్మాణంలో 90 శాతం చెట్లు తొలగింపు పూర్తయిందని, మిగిలిన విద్యుత్లైన్ల తొలగింపు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కోహెడ, -సముద్రాల బీటీ రోడ్ పనులను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని గడువు విధించారు.
హుస్నాబాద్-రామవరం, అక్కన్నపేట, -కొత్తకొండ రోడ్లతో పాటు ఇతర భవన నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఎంఎన్ఆర్ఈజీఎం స్కీం కింద హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల పరిధిలోని 17 జీపీ భవనాలు డిసెంబర్ లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
