
నస్పూర్/నిర్మల్/ఆదిలాబాద్‌టౌన్/ఆసిఫాబాద్, వెలుగు: ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మంచిర్యాల, బెల్లంపల్లి అర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.
మంచిర్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న వారిని ఓటరు జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సంఘ సభ్యుడు గుమ్ముల లింగయ్య దరఖాస్తు అందజేశారు. లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్‌కు చెందిన ఎస్కే ఫర్హానా తన భర్త చనిపోయాడని, ఒంటరిగా కొడుకును పోషించడం కష్టంగా మారిందని, తనకు ఉపాధి కల్పించాలని కోరింది. భూ సమస్యలు పరిష్కరించాలని, భూసేకరణ పరిహారం అందించారని, ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించాలని, తదితర సమస్యలపై 38 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
అధికారులు వెంటనే స్పందించాలి
ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని నిర్మల్కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వానాకాలం నేపథ్యంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ పనుల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అనంతరం జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్నకల్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌లో 98 దరఖాస్తులు
ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవా లని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 98 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్‌సలోని చాబ్ర, అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
ఆసిఫాబాద్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీవో లోకేశ్వర్ రావుతో కలిసి కలెక్టర్వెంకటేశ్ ధోత్రే అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు పరిష్కరించాలని, వృద్ధాప్య పింఛన్, పట్టా పాస్ పుస్తకం, ఇందిరమ్మ ఇండ్లు, గురుకులంలో సీటు ఇప్పించాలని, ఉపాధి కల్పించాలని కోరుతూ ప్రజలు అర్జీలు సమర్పించారు.