గ్రీవెన్స్ అర్జీలపై వెంటనే స్పందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

గ్రీవెన్స్ అర్జీలపై వెంటనే స్పందించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  •     ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు

ఆసిఫాబాద్/ఆదిలాబాద్/నిర్మల్/నస్పూర్/ఇంద్రవెల్లి(ఉట్నూర్), వెలుగు: ప్రజావాణిలో వచ్చిన  దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 

సిర్పూర్ టి మండలం పూసిగూడకు చెందిన గిరిజనులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అటవీ శాఖ సమస్య పరిష్కరించాలని, చింతలమనేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన యువకులు తమ గ్రామపంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్జీలు సమర్పించారు. పింఛన్ ఇప్పించాలని, భూమిని విరాసత్ చేయాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, డెత్ సర్టిఫికెట్ జారీ చేయాలని, పట్టా మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్​లో 82 దరఖాస్తులు

గ్రీవెన్స్ లో వచ్చే ప్రతి అర్జీపై తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదిలాబాద్​అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన గ్రీవెన్స్ లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 

ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, ఉపాధి, భూభారతి సహా వివిధ విభాగాలకు చెందిన మొత్తం 82 దరఖాస్తులు అందాయని, వాటిని శాఖల వారీగా త్వరితగతిన పరిశీలించి పురోగతి వివరాలు దరఖాస్తుదారులకు తెలియజేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చాప్రా, డిప్యూటీ కలెక్టర్ వంశీ కృష్ణ పాల్గొన్నారు. 

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్​ అడిషనల్ కలెక్టర్ కిశోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఆర్డీవో రత్నకల్యాణి, జడ్పీ సీఈవో గోవింద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి 

ప్రజావాణిలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి.చంద్రయ్య ఆదేశించారు. కలెక్టరేట్​లో ఆర్డీవో శ్రీనివాస్ రావు తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. పట్టా మార్పు చేయాలని, తాగునీటి సరఫరా సమయాన్ని మార్చాలని, ఆలస్యమైన పరిహారంపై వడ్డీ చెల్లించాలని, తమ భూమిని అక్రమంగా చేసుకున్న పట్టాను రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తులు అందించారు. మొత్తం 27 దరఖాస్తులు అందాయని కలెక్టర్​తెలిపారు.

ఉట్నూర్​ ఐటీడీఏ కార్యాలయంలో..

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ దరఖాస్తులు స్వీకరించారు. పట్టా మంజూరు చేయాలని, కిరాణా షాప్​పెట్టుకునేందుకు లోన్ ఇప్పించాలని, గొర్రెల లోన్ మంజూరు చేయాలని, పింఛన్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు అందజేశారు.