కాలేజీ స్టూడెంట్​కు 46 కోట్ల ట్యాక్స్ నోటీసు

కాలేజీ స్టూడెంట్​కు 46 కోట్ల ట్యాక్స్ నోటీసు
  • తన పాన్ కార్డ్ మిస్​యూజ్ అయిందని యువకుడి ఫిర్యాదు
  • దాంతో కంపెనీ రిజిస్టర్.. ఖాతా ఓపెన్​.. కోట్లలో లావాదేవీలు

గ్వాలియర్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌‌‌‌లోని గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ స్టూడెంట్ పేరిట ఉన్న అకౌంట్ లో రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీలకు సంబంధించి అతనికి ఇన్​కం ట్యాక్స్​, జీఎస్​టీ నుంచి ఆ మొత్తానికి ట్యాక్స్ నోటీసు వచ్చింది. దీంతో కంగుతిన్న అతను తన పాన్​ కార్డును ఎవరో మిస్​యూజ్ చేశారని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25 ఏండ్ల ప్రమోద్ కుమార్ కాలేజీ స్టూడెంట్.. ఇన్​కం ట్యాక్స్​, జీఎస్‌‌టీ నుంచి అతని పాన్ కార్డ్ ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ అయిందని, ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయాని.. దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. 2021లో ముంబై, ఢిల్లీలో ఆ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించినట్లు నోటీసుల్లో పేర్కొన్నాయి. ‘‘నేను గ్వాలియర్‌‌లో కాలేజీ స్టూడెంట్​ను. ఆదాయపు పన్ను, జీఎస్​టీ నుంచి నోటీసు వచ్చింది. నా పాన్ కార్డు ద్వారా ఒక కంపెనీ రిజిస్టర్ అయి.. 2021లో ముంబై, ఢిల్లీలో నిర్వహించినట్టు తెలిసింది. ఇదంతా ఎట్ల జరిగిందో నాకు తెలియదు. నా పాన్ కార్డ్ మిస్ యూజ్ అయింది” అని అన్నారు. ఇన్​కం ట్యాక్స్ వారి నుంచి నోటీసు అందగానే సంబంధిత ఆఫీసర్లతో మాట్లాడినట్లు కుమార్ తెలిపారు. ఆ తర్వాత పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. శుక్రవారం ఏఎస్పీ ఆఫీసుకు వెళ్లి మరోసారి కంప్లైంట్​చేసినట్లు చెప్పారు. ఏఎస్పీ షియాజ్ కేఎం మీడియాతో మాట్లాడుతూ.. తన పాన్ కార్డును మిస్​యూజ్​ చేసి, దాని ద్వారా ఒక కంపెనీని రిజిస్టర్ చేసి, ఈ లావాదేవీలు జరిపినట్టు ఒక యువకుడి నుంచి ఫిర్యాదు వచ్చిందన్నారు. ఆ బ్యాంకు ఖాతా ద్వారా రూ.46 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను తనిఖీ చేస్తున్నామని చెప్పారు.