కొలంబియాలో ఆర్మీ ప్లేన్ కూలి.. 80 మంది సైనికులు మృతి.!

కొలంబియాలో ఆర్మీ  ప్లేన్ కూలి.. 80 మంది సైనికులు మృతి.!

బొగోటా: దక్షిణ అమెరికాలోని కొలంబియాలో సోమవారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. సైనికులతో వెళ్తున్న మిలిటరీ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది.ఈ ప్రమాదంలో సుమారు 80 మంది జవాన్లు మరణించినట్లు కొలంబియా ఆర్మీ ప్రకటించింది. ప్రమాద సమయంలో విమానంలో సైనికులు, సిబ్బంది కలిపి మొత్తం 120 మంది ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదానికి గురైన విమానం సీ-130 హెర్క్యులస్  రకానికి చెందిన టాక్టికల్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ అని అధికారులు తెలిపారు.

 ఈ విమానం కొలంబియాలోని ప్యూర్టో లెగుయిజామో నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందన్నారు. అడవి మధ్యలో శకలాలు మంటల్లో చిక్కుకున్న దృశ్యాలను అక్కడి ప్రభుత్వ బ్రాడ్‌‌‌‌కాస్టర్ ఆర్సీఎన్ ప్రసారం చేసింది."మిలిటరీ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే, మృతుల సంఖ్య, ప్రమాదానికి గల కారణాలు ఇంకా అధికారికంగా ధ్రవీకరించలేదు" అని కొలంబియా రక్షణ మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జవాన్ల మృతి దేశానికి అత్యంత బాధాకరమైన విషయమన్నారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన..వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని పేర్కొన్నారు.